టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మంగళగిరిలో అభిమానులు, క్రికెట్ ప్రేమికులను ఉత్సాహపరిచారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) చివరి దశ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ఏపీఎల్ ట్రోఫీని, టోర్నీలో పాల్గొంటున్న జట్ల జెర్సీలను ఆవిష్కరించారు. ఆయన రాకతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై రామ్ చరణ్‌కు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు అద్భుతమైన వేదికగా నిలుస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఇలాంటి టోర్నమెంట్లు మంచి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు.
క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, పోరాట స్ఫూర్తిని పెంచుతాయని తెలిపారు. ఏపీఎల్‌లో పాల్గొంటున్న అన్ని జట్ల ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షిస్తూ రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం అనంతరం భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), ఏసీఏ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఏపీఎల్ లీగ్ దశ మ్యాచ్‌లు జూన్ 27 వరకు కొనసాగనున్నాయి. అనంతరం ప్లేఆఫ్స్ నిర్వహించి, జూన్ 30న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం భీమవరం బుల్స్ జట్టు 6 మ్యాచ్‌లలో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.


