హైదరాబాద్ శివార్లలోని ఐటీ కారిడార్ ప్రాంతంలో భారీ భూ కబ్జా యత్నాన్ని హైడ్రా అధికారులు అడ్డుకున్నారు. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో దాదాపు రూ.1000 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
మెటల్ చార్మినార్ నుంచి హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు వెళ్లే ప్రధాన మార్గంలో ఉన్న సర్వే నంబర్ 42లోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిపై కొందరు అక్రమంగా కన్నేశారు. స్థలం చుట్టూ రేకులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు తాత్కాలిక షెడ్లు, గది నిర్మించి ఆక్రమించేందుకు ప్రయత్నించారు.
ఈ విషయాన్ని గుర్తించిన రెవెన్యూ శాఖ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన హైడ్రా బృందం అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను తొలగించింది. అనంతరం భూమి చుట్టూ రక్షణ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఇది ప్రభుత్వ భూమి అని తెలియజేసే బోర్డులను ఏర్పాటు చేసింది.ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని, ఎంత విలువైన ప్రాంతమైనా అక్రమ ఆక్రమణలను సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.మరోవైపు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మర్రిపల్లి గ్రామంలో చెరువు భూమి ఆక్రమణ ప్రయత్నాన్ని కూడా హైడ్రా అడ్డుకుంది. పట్టా భూమిలో ఏర్పాటు చేసిన ఆర్‌ఎంసీ యూనిట్ నుంచి వ్యర్థాలను చెరువులోకి వేసి సుమారు ఐదెకరాల చెరువు భూమిని ఆక్రమించే ప్రయత్నం జరుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు.దీనిపై విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు చెరువు శిఖం పరిధిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను తొలగించారు. చెరువులో వేసిన మట్టిని వెంటనే తొలగించాలని సంబంధిత వ్యక్తులను ఆదేశించారు.హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, పార్కుల పరిరక్షణ కోసం హైడ్రా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గత రెండేళ్లలో రూ.1.10 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ ఆస్తులను కబ్జాల నుంచి కాపాడినట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు కఠిన చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.


