రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా సోడమ్ మండలం అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (పక్షి ఫ్లూ) కేసులపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. NIHSAD, భోపాల్ ప్రయోగశాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా భారత ప్రభుత్వ పశుసంవర్ధక & డెయిరీయింగ్ శాఖ (DAHD) ద్వారా ఫిబ్రవరి 8న వ్యాధి నిర్ధారణ జరిగినట్లు ఆయన వెల్లడించారు. నిర్ధారణ వెలువడిన వెంటనే ప్రభావిత ప్రాంతాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ (RRTs) ను మోహరించి, నిర్ణీత ప్రామాణిక కార్యాచరణ విధానాల (SOPs) ప్రకారం కట్టుదిట్టమైన కల్లింగ్ (తొలగింపు) చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియ జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పశుసంవర్ధక, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో సమర్థవంతంగా కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభావిత ప్రాంతాల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా పర్యవేక్షణను మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా కర్వేటినగరం మండలంలో పక్షుల అకస్మాత్తు మరణాల సమాచారం మేరకు క్షేత్రస్థాయిలో పశువైద్య బృందాలు పరిశీలనలు నిర్వహించి, నమూనాలను పరీక్షల కోసం NIHSAD, భోపాల్‌కు పంపినట్లు చెప్పారు. సంబంధిత రైతులకు అవసరమైన బయోసెక్యూరిటీ, ముందస్తు జాగ్రత్త చర్యలపై స్పష్టమైన సూచనలు అందించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఆదివారం రెండు పొలాలలో కల్లింగ్ ప్రక్రియ పూర్తయిందని మంత్రి తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లో భారత ప్రభుత్వం ద్వారా వ్యాధి నిర్ధారణ జరిగినట్లు వెల్లడించారు. సోడమ్ మండలం నుంచి ఒకటి, కర్వేటినగరం మండలం నుంచి మరో ఒకటి చొప్పున మొత్తం రెండు అదనపు నమూనాలను పరీక్షల కోసం NIHSAD, భోపాల్ ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయా నమూనాల పరీక్షా ఫలితాల కోసం అధికారులు వేచి చూస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు ఆదివారం కర్వేటినగరం ప్రాంతంలోని పొలాన్ని ప్రత్యక్షంగా సందర్శించి, సిబ్బందికి మరియు రైతులకు వ్యాధి నియంత్రణకు సంబంధించి పాటించాల్సిన ప్రోటోకాల్‌లు, బయోసెక్యూరిటీ చర్యలపై స్పష్టమైన మార్గనిర్దేశం చేశారని మంత్రి తెలిపారు.ప్రజలు ఎలాంటి భయం లేదా అపోహలకు లోనవ్వాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా అనేది పక్షులకు మాత్రమే సంబంధించిన వ్యాధి అని, సరైన విధంగా వండిన కోడి మాంసం మరియు గుడ్ల వినియోగం పూర్తిగా సురక్షితమని స్పష్టం చేశారు. ప్రభుత్వం అవసరమైన అన్ని నివారణ, నియంత్రణ చర్యలను పటిష్టంగా అమలు చేస్తోందని తెలిపారు. కోడి పెంపకదారులు బయోసెక్యూరిటీ చర్యలను కఠినంగా పాటించాలని, పక్షుల్లో ఏవైనా అసాధారణ మరణాలు గమనించిన వెంటనే సమీప పశువైద్య అధికారులకు తక్షణమే సమాచారం అందించాలని మంత్రి సూచించారు. వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించేందుకు కోడి పెంపకదారులు, సాధారణ ప్రజలు పశుసంవర్ధక శాఖకు పూర్తి సహకారం అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.
ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజాను పూర్తిగా నియంత్రణలోకి తీసుకొస్తున్నాం : అచ్చెన్నాయుడు
RELATED ARTICLES




