రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో పాటు పలువురికి గాయాలు కలిగిన కేసులో టీవీ నటుడు ఖయూమ్ అలియాస్ లోబోకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ మేరకు గురువారం జనగామ కోర్టు తీర్పు వెలువరించింది.
వివరాల్లోకి వెళితే… 2018 మే 21న ఓ టీవీ ఛానల్ తరఫున వీడియో చిత్రీకరణ కోసం లోబో బృందం వేయిస్తంభాల గుడి, భద్రకాళి చెరువు, రామప్ప, లక్డ్నవరం వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద లోబో డ్రైవ్ చేస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించారు. కారులో ఉన్న లోబోతో పాటు బృంద సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రఘునాథపల్లి పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం లోబో నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ఇద్దరి మృతి సంభవించిందని కోర్టు నిర్ధారించింది. దీంతో ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించింది.




