విజయవాడ మ్యూజియం రోడ్‌లోని ఇరిగేషన్ ఆఫీసులో ఏపీఎస్ఐడిసి డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్యఅతిథిగా పాల్గొని ఏపీఎస్ఐడిసి చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణతో కలిసి ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లను అభినందించారు. ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి ఇందిరా ప్రియదర్శిని ఏపీఎస్ఐడిసి డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం పట్ల ఎంపీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ డైరెక్టర్లు సమిష్టిగా పనిచేసి ఐడీసీ ద్వారా రైతాంగానికి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. మైలవరం నియోజకవర్గంలో ఇందిరా ప్రియదర్శిని తెలుగుదేశం పార్టీ విజయానికి ఎనలేని కృషి చేశారని, ఆమె కష్టానికి తగిన గుర్తింపు లభించిందని ఎంపీ తెలిపారు. ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసిన ఫలితంగానే రాష్ట్రంలో భారీ విజయాన్ని సాధించామని ఎంపీ శివనాథ్ పేర్కొన్నారు. ఈ విజయాన్ని ప్రజల అభ్యున్నతికి ఉపయోగించేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు.
వేద్రాది ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే రైతులకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎంపీ తెలిపారు. అలాగే, ఒక మోటార్ రిపేర్ కోసం ఎంపీ నిధుల నుంచి రూ.33 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.దసరా ఉత్సవాల ఆధ్యాత్మిక శోభను దేశ నలుమూలల చాటి చెప్పేందుకు నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలి ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకుడు అంకెం సురేష్, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.




