ఐపీఎల్ లీగ్ లో భాగంగా సోమవారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ ను గ్రౌండ్ లో వీక్షించే అవకాశం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) 30మంది అనాథ చిన్నారులకు కల్పించింది. వైజాగ్ లోని పాపా హోమ్ అనాథ శరణాలయానికి 30 టికెట్లు తన సొంత నిధులతో కొని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందజేసింది. మ్యాచ్ ను వీక్షించేందుకు విచ్చేసిన చిన్నారులకు ఎసిఎ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎసిఎ కార్యదర్శి రాజ్యసభ ఎంపి సానా సతీష్, ఎసిఎ కోశాధికారి దండమూడి శ్రీనివాస్ చిన్నారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కావాల్సిన సదుపాయాలు దగ్గరుండి చూశారు. కాసేపు వారితో సరదాగా కబుర్లు చెప్పారు. తమకు మ్యాచ్ చూసే అవకాశం కల్పించిన ఎసిఎ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆ చిన్నారులు కృతజ్ఞతలు తెలిపారు.