మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన కార్పొరేటర్ శ్రవణ్ స్థానిక ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు.ఆర్.కే.నగర్‌లో జరుగుతున్న వర్షపు నీటి ఇంకుడు గుంతలను పరిశీలించిన శ్రవణ్, భారీ వర్షాల్లో రోడ్లపై నిలిచే నీరు సులభంగా ఇంకుడు గుంతల్లోకి చేరేలా డిజైన్ చేయాలని అధికారులకు సూచించారు.ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
అదేవిధంగా, సఫిలగూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ పండుగ ఏర్పాట్లను సమీక్షించారు. నిమర్జనం కోసం నింపిన నీటిని మోటార్ల ద్వారా బయటకు తీసి, బేబీ పాండ్‌ను పూర్తిగా శుభ్రపరిచి పండుగకు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు.
ఇక మల్కాజ్గిరి ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.గతంలోనే హాస్పిటల్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి సూపరింటెండెంట్‌కు లేఖ రాసినా, ఈ రోజు జరిగిన సమావేశానికి స్థానిక కార్పొరేటర్‌ను పిలవకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజల సమస్యలు ప్రస్తావనకు రాకుండా చేయాలన్న ఉద్దేశ్యంతోనే కార్పొరేటర్‌ను పక్కన పెట్టారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదని విమర్శించిన శ్రవణ్, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను తప్పనిసరిగా భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, రమేష్, నందు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
మొత్తంగా, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ అభివృద్ధి పనులపై ఒక వైపు దృష్టి సారిస్తూనే, ప్రజలకు సంబంధించిన సమస్యలను పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యంపై కఠినంగా స్పందించడం గమనార్హం.




