Friday, March 6, 2026
Google search engine
Homeతెలుగుతాజావార్తలుకాంగ్రెస్‌పై రామచందర్ రావు ఘాటు విమర్శలు – బీజేపీకి కార్యకర్తలే బలం

కాంగ్రెస్‌పై రామచందర్ రావు ఘాటు విమర్శలు – బీజేపీకి కార్యకర్తలే బలం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ (టీజేఎస్‌యూ) నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర రాజకీయాలపై, కాంగ్రెస్ వైఫల్యాలపై, భవిష్యత్ దిశపై విస్తృతంగా మాట్లాడారు.

రామచందర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇప్పటివరకు ప్రకటించిన పథకాలేవీ విజయవంతం కాలేదని, ప్రజలను మోసం చేయడమే ఆ పార్టీ తీరుగా మారిందని అన్నారు. ప్రత్యేకంగా “తులం బంగారం పథకం ఏం అయింది?” అని ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అంతా వృథా అయిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు నిజమైన ఉపశమనం ఇవ్వడంలో కాంగ్రెస్ విఫలమైందని స్పష్టం చేశారు.

బీ ఆర్ ఎస్–కాంగ్రెస్ ఒకటే!

బీ ఆర్ ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య ఎలాంటి తేడా లేదని రామచందర్ రావు అన్నారు. “ఇద్దరూ ఒకే నాణానికి రెండు వైపులు. ప్రజల కోసం కాకుండా అధికార ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు.

బీజేపీకి కార్యకర్తలే బలం

రామచందర్ రావు మాట్లాడుతూ, “మా కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అన్యాయం చేయదు. నేనూ ఒక కార్యకర్తనే. నన్ను గెలిపించింది కార్యకర్తలే” అని గర్వంగా అన్నారు. బీసీ వర్గాలకు బీజేపీ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని, వారిని రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు తీసుకురావడం తమ లక్ష్యమని హామీ ఇచ్చారు.

రాహుల్ గాంధీపై సూటి వ్యాఖ్యలు

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు చోరీ చేశారని విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, రామచందర్ రావు కాంగ్రెస్ నాయకత్వంపై వ్యంగ్యం గుప్పించారు. “రాహుల్ గాంధీకి మెదడు చోరీ అయింది. మరి ఎక్కడ చోరీ ఉంది?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి నిజమైన దిశా నిర్దేశం చేసే నాయకత్వం లేదని అన్నారు.

హౌసింగ్, హైడ్రా వివాదం

హైడ్రా ప్రాజెక్ట్‌లో జరిగిన అన్యాయాలపై కాంగ్రెస్ వైట్ పేపర్ ఇవ్వాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. “ఎంతమంది సంపన్నుల ఇళ్లను కూలగొట్టారో ప్రజలకు చెప్పండి. వాస్తవాలు దాచిపెట్టడం కాంగ్రెస్ అలవాటు” అని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ జాయినింగ్స్‌పై సస్పెన్స్

రాష్ట్ర రాజకీయ పరిణామాలపై మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొత్త జాయినింగ్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్‌లో ఎవరు చేరతారో మీరు చూడండి. నేను చెప్పను. సినిమా చాలా ఉంది, సస్పెన్స్ కూడా చాలానే ఉంది” అంటూ రాజకీయ వాతావరణాన్ని మరింత రసవత్తరంగా మార్చారు.

డ్రగ్స్ నియంత్రణపై పిలుపు

రాష్ట్రంలో డ్రగ్స్ విస్తరిస్తున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన రామచందర్ రావు, “డ్రగ్స్ చాలా ప్రమాదకరం. ఇది సమాజాన్ని నాశనం చేస్తుంది. మనమంతా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి” అని సూచించారు. యువతను ఈ ముప్పు నుండి కాపాడడం అత్యవసరమని అన్నారు.

రైతుల కోసం కేంద్రమే కృషి

రామచందర్ రావు మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం కేంద్రమే నిజాయితీగా ఆలోచిస్తోందని స్పష్టం చేశారు. “రైతుల కోసం కృషి చేయడం బీజేపీ ప్రభుత్వ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్లే రైతులు లాభపడుతున్నారు” అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular