Thursday, April 10, 2025
Google search engine
Homeతెలుగురాజకీయంఎస్ ఎల్ బి సి ప్రమాదంపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి

ఎస్ ఎల్ బి సి ప్రమాదంపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమల పెంట ఎస్ఎల్ బీసీ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు అవసరమైన సహాయక చర్యలను కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సహాయక చర్యలను నిరంతరం దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటిని ప్రత్యేకాధికారిగా నియమించాలని సీఎస్ ను ఆదేశించారు.
సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన కొనసాగుతున్న సహాయక చర్యల పురోగతిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్షించారు.
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నెల రోజులుగా ప్రమాద స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల పురోగతిని విపత్తు నిర్వహణ విభాగం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్​ కుమార్​, కల్నల్ పరీక్షిత్ మెహ్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు.
కేంద్ర రాష్ట్రాలకు చెందిన వివిధ విభాగాలతో పాటు ప్రైవేటు సంస్థలన్నీ కలిపి 25 ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని చెప్పారు. మొత్తం 700 మంది సిబ్బంది ఈ ఆపరేషన్ లో నిమగ్నమైనట్లు చెప్పారు.
సొరంగంలో కూలిన రాళ్లు, టీబీఎం విడిభాగాలను వెల్డింగ్ చేసి బయటకు తీస్తున్నామని, ఎప్పటికప్పుడు అక్కడ పేరుకున్న మట్టి, రాళ్ల దిబ్బలు, పూడిక, ఊట నీటిని బయటకు తొలిగిస్తున్నామని వారు చెప్పారు.
రెస్క్యూ ఆపరేషన్ కళ్లకు కట్టించేలా ప్రమాదం జరిగిన రోజున, ఇప్పుడున్న పరిస్థితుల ఫొటోలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రదర్శించారు.
ఇన్లెట్ వైపు నుంచి సొరంగంలో 14 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగినందున గాలి, వెలుతురు తక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం సంక్లిష్టంగా సాగుతోందని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు.
ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్లు అత్యంత ప్రమాదకర జోన్ గా గుర్తించినట్లు వారు చెప్పారు. జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాల్సి ఉంటుందనే వారి అభిప్రాయం వెలిబుచ్చారు.
ప్రమాదానికి గురైన కార్మికుల ఆచూకీ కనుక్కునేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ఈ ఆపద సమయంలో చేపట్టాల్సిన అత్యవసర పనులకు కేంద్రం నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు.
ఫిబ్రవరి 22వ తేదీన ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం జరిగింది. ఎనిమిది మంది కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. వీరిలో గుర్ ప్రీత్ సింగ్ మృతదేహం మార్చి 9వ తేదీన లభ్యమైంది.
కానీ మిగతా కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగించాలని, అవసరమైన అన్ని ప్రత్యామ్నాయాలను అనుసరించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎక్స్​పర్ట్ కమిటీ సూచనల మేరకు పనులు కొనసాగించాలని అన్నారు.
తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్ మిశ్రా, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ, సింగరేణి, హైడ్రా, ఫైర్ సర్వీసెస్ ప్రతినిధులు, ఎస్ఎల్బీసీ పనులు చేపడుతున్న కాంట్రాక్టు కంపెనీ ఎండీ పంకజ్ గౌర్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రంగనాథ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments