ఆసియా కప్-2025లో భాగంగా యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ లైనప్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంచనాల ప్రకారం అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని భావించినా, అతనికి చోటు దక్కలేదు. కేవలం ఒకే ఒక్క ప్రధాన పేసర్‌తో టీమిండియా బరిలోకి దిగడం అభిమానులకు షాక్ ఇచ్చింది.
ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా పేస్ బౌలింగ్‌ను నడిపించగా, హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబేలను కూడా ఫాస్ట్ బౌలింగ్ కోసం ఉపయోగించారు. అయితే ముగ్గురు స్పిన్నర్లను ఒకేసారి జట్టులోకి తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
జట్టు కూర్పుపై వచ్చిన విమర్శలపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోటక్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ – “తుది జట్టు ఎంపికలో ఎలాంటి ఎజెండా ఉండదు. జట్టుకు అవసరం ఏదో దానిని బట్టి కెప్టెన్, ప్రధాన కోచ్ నిర్ణయం తీసుకుంటారు. జట్టులో ఉన్న 15 మంది అందరూ ఆడటానికి అర్హులే. కానీ మైదానంలో 11 మందికి మాత్రమే అవకాశం దక్కుతుంది. ఈ పిచ్‌లో స్పిన్నర్లకు మద్దతు ఉంటుందని భావించాం. అందుకే అర్ష్‌దీప్‌ను తీసుకోలేదు” అని స్పష్టం చేశారు.
అలాగే, సంజూ శాంసన్ బ్యాటింగ్ ఆర్డర్‌పై కూడా ఆయన మాట్లాడారు. “సంజు ఇప్పటివరకు 5 లేదా 6వ స్థానాల్లో ఎక్కువగా ఆడలేదు. కానీ దాని అర్థం అతను ఆ స్థానాల్లో ఆడలేడని కాదు. సంజు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాడు. జట్టు అవసరాన్ని బట్టి కెప్టెన్, ప్రధాన కోచ్ ఏ స్థానం కేటాయించినా అతను సిద్ధంగా ఉంటాడు” అని సీతాన్షు వివరించారు.




