Friday, March 6, 2026
Google search engine
Homeతెలుగుక్రైమ్నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారికి భరోసా - నారా లోకేష్ సమీక్ష

నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారికి భరోసా – నారా లోకేష్ సమీక్ష

నేపాల్‌లో ఏర్పడిన సంక్షోభం కారణంగా అక్కడికి పర్యటనకు వెళ్లిన పలువురు తెలుగువారు చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా వ్యవహరిస్తోంది. రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నేపాల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడం ఒక్కటే ప్రభుత్వ అజెండా అని లోకేష్ స్పష్టం చేశారు.

అధికారులు అందించిన వివరాల ప్రకారం, ఇప్పటి వరకు 215 మంది తెలుగువారు నేపాల్‌లో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారని తెలిసింది. వీరు నేపాల్‌లోని బఫాల్, సిమిల్ కోట్, పశుపతి నగరం, పింగలస్థాన్ ప్రాంతాల్లో సురక్షితంగా ఉన్నారని, వారితో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ, ప్రతి రెండు గంటలకు వారి పరిస్థితిని మానిటర్ చేయాలని, వారికి ఆహారం, నీరు, భద్రతా ఏర్పాట్లు సమృద్ధిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా లోకేష్ ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టర్లు ఈ ఆపరేషన్‌పై నిరంతరం దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే, చిక్కుకున్న వారిలో ఎవరు ఏ జిల్లాకు చెందిన వారు, వారి కుటుంబ సభ్యుల వివరాలు, కాంటాక్ట్ నంబర్లు సమగ్రంగా సిద్ధం చేయాలని సూచించారు.

నేపాల్‌లో చిక్కుకున్న వారిలో పలువురితో నేరుగా ఫోన్, వీడియో కాల్ ద్వారా మంత్రి లోకేష్ మాట్లాడారు. ముఖ్యంగా విశాఖపట్నానికి చెందిన సూర్యప్రభతో వీడియో కాల్ ద్వారా సంభాషించారు. ఆమెతో మాట్లాడిన లోకేష్, ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, వారికి అందుబాటులో సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. సూర్యప్రభ మాట్లాడుతూ, తాము ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి నేపాల్‌లో చిక్కుకున్నామని, ప్రస్తుతం ఒక హోటల్‌లో సురక్షితంగా ఉన్నామని తెలిపారు. దీనిపై మంత్రి లోకేష్ ఆమెకు ధైర్యం నూరిపోశారు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలని, బయటకు రావొద్దని సూచించారు. రాష్ట్ర అధికారులు ప్రతి రెండు గంటలకు ఒకసారి మీతో సంప్రదిస్తారని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక విమానాల ద్వారా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు.

అంతేకాకుండా లోకేష్ మాట్లాడుతూ, “ఈ పరిస్థితి సవాలు అయినప్పటికీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్కరు సురక్షితంగా తిరిగి వచ్చేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఈ రక్షణ ఆపరేషన్‌లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు,” అని స్పష్టం చేశారు.

నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని, ఎటువంటి ఆందోళన అవసరం లేదని లోకేష్ హామీ ఇచ్చారు. ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసి, ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

ఈ చర్యలన్నీ చూస్తే, ప్రభుత్వం పరిస్థితిని అత్యవసరంగా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టిందని స్పష్టమవుతోంది. నేపాల్‌లో చిక్కుకున్న ప్రతీ ఒక్క తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడమే ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular