హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన మహోత్సవం కోసం అన్ని విభాగాలు సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈసారి గణేష్ శోభాయాత్రలు మొత్తం 303 కిలోమీటర్ల మేర కొనసాగనున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నిమజ్జనం కోసం జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులు సిద్ధం చేయగా, 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు వినియోగానికి సిద్ధంగా ఉన్నాయి. హుస్సేన్ సాగర్‌లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు మోహరించారు. భద్రతా పరంగా 30 వేల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం నియమించగా, 160 యాక్షన్ టీంలు ఎప్పటికప్పుడు నిఘా వహించనున్నాయి. అదనంగా నగరంలో 13 కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేయనుండగా, రాత్రివేళ నిమజ్జనాలు సాఫీగా సాగేందుకు 56,187 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అధికారులు అంచనా ప్రకారం ఈ నెల 6న సుమారు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖైరతాబాద్ భారీ గణేష్ నిమజ్జనం ఆరో తేదీ మధ్యాహ్నం 1.30 గంటల లోపు పూర్తి చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.




